ప్రతి మనిషి జీవితంలో విడదీయరాని అనుబంధం ఉన్న సబ్జెక్టు గణితమని, దానిపై పట్టు సాధించడం ఉన్నతికి బాటలు వేసుకోవడమేనని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ జి.జగదీశ్వర్ రెడ్డి అన్నారు. గీతం డీమ్స్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 'మేథమెడికల్ సైన్సెస్ అండ్ అప్లికేషన్స్' పై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును శుక్రవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి, గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీవీఎస్ మూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించాక ఆయన మాట్లాడుతూ, భిక్షగాడి నుంచి బిర్లా వరకు, వ్యవసాయం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకూ అంతా గణిత శాస్త్రంతోనే ముడిపడి ఉందని, అత్యావశ్యకమైన పాఠ్యాంశంగా నిలిచిపోయిందన్నారు. ప్రపంచాన్ని నడిపిస్తోందే గణితమని, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానమంతా గణితశాస్త్రంతో ముడిపడినదేనని జగదీశ్వర్ రెడ్డి స్పష్టీకరించారు. ప్రపంచంలోని గణిశాస్త్ర మేధావులంతా భారతీయులేనని, ఆ ఒరవడిని ముందు తరాల వారు కూడా కొనసాగించాలన్నారు.
| భౌతిక, రసాయన శాస్త్రాల ప్రయోగాలు చేపట్టాలన్నా, మంచి భవనానికి రూపకల్పన చేయాలన్నా, పై వంతెనలు (ఫ్లైవోవర్), వంతెలను నిర్మించాలని గణితశాస్త్రంపై పట్టు అత్యావశక్యకమన్నారు. గణితం అర్థమైతే వందకు వంద మార్కులు వస్తాయని, అదే మరోవిధంగా అయితే ఆ సబ్జెక్టుకు దూరంగా జరగక తప్పదని చమత్కరించారు. స్వతహాగా గణితంపై అంతగా మక్కువ చూపని తాను తన కుమార్తె విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, గణితశాస్త్రంలోని ప్రాథమిక విషయాలపై అవగాహనను పెంపొందించే యత్నం చేస్తున్నట్టు చెప్పారు. తన కుమార్తెకు మంచి గణితశాస్త్ర బోధకుడిని నియమించడం కోసం ఎంతో శ్రమించినట్టు తెలిపారు. తన సహ విద్యార్థులు గణితంపై భయంతోనే పాఠశాల మధ్యలోనే బడి మానేశారని, ఒకటో తరగతిలో 60 మంది ఉండగా, ఏడో తరగతికి వచ్చేసరికి ఆ సంఖ్య 21కు తగ్గిపోయినట్టు జీవన సత్యాన్ని వెల్లడించారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక సృజనాత్మక శక్తి ఉంటుందని, దానిని గుర్తించి వెలికితీసే బాధ్యతను అధ్యాపకులు తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. గణిశాస్త్ర ఔన్నత్యాన్ని పెంచి, దాని ఫలాలు పదిమందికీ పంచాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సు విజయవంతం కావాలని, ఓ మైలురాయిగా నిలిచిపోవాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అభిలషించారు. మంత్రిని గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్, అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు.
గత దశాబ్ద కాలంలో గీతం పురోగతి, ఈ సదస్సు నిర్వహణ ఆవశ్యకతల గురించి తన స్వాగతోపన్యాసంలో గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ వివరించారు. గణితశాస్త్రంలోని ప్రముఖులందరినీ ఓ వేదికపైకి తీసుకొచ్చి ఆ శాస్త్ర పురోగతి గురించి వారి ఆలోచనలు, భావనలు, పరిశోధనాంశాలను పంచుకోవాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు సదస్సు నిర్వాహకుడు (కన్వీనర్) ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ తెలిపారు. వంద పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని ఆశించామని, ఆ సంఖ్య 300 లకు పెరిగి తమ బాధ్యతను రెట్టింపు చేసిందన్నారు. ఇండియన్ మేథమెడికల్ సొసైటీ అధ్యక్షడు ప్రొఫెసర్ ఎస్.ఆర్ముగం, ఆంధ్రా-తెలంగాణ మేథమెడికల్ సొసైటీ అద్యక్షుడు ఈ.కేశవరెడ్డి, అమెరికా నుంచి వచ్చిన తెలుగు శాస్త్రవేత్త జెర్మయ్య కె.బిల్లా తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సదస్సు నిర్వాహక కార్యదర్శులు డాక్టర్ శివారెడ్డి శేరి, డాక్టర్ పి.నరసింహస్వామి, కోశాధికారి డి.మల్లిఖార్జునరెడ్డి తదితరులు సమన్వయం చేశారు. ఆదివారం వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో 300 మంది పత్ర సమర్పణ చేయనున్నారు.
సభాధ్యక్షత వహించిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ, గణితశాస్త్ర జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఎదురవుతున్న సవాళ్ళ పరిష్కారానికి వినియోగించాలని పిలుపునిచ్చారు. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల అతిసూక్ష్మ అవశేషాలు (మైక్రో పార్టికల్స్) మనకు అపార నష్టం కలిగిస్తున్నామని, గణితశాస్త్ర విజ్ఞానంతో అటువంటి సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలని కోరారు. గణితశాస్త్ర బోధకులు కేవలం పోటీపరీక్షలలో నెగ్గడానికి కాకుండా, విద్యార్థుల జీవన సవాళ్ళను ఎదుర్కొనేలా తర్ఫీదు ఇవ్వాలన్నారు. తాను పాఠశాల స్థాయి నుంచి గణితశాస్త్రంలో మంచి మార్కులు సాధించేవాడినని, ప్రొఫెసర్ బాబయ్య అనే అధ్యాపకుడి వద్ద తన తొమ్మిది నుంచి 14వ యేట వరకు గణితశాస్త్రం అభ్యసించానని, ఆయన గణితంతో పాటు చరిత్ర కూడా బోధించేవారని వివరించారు. తాను ఇంటర్మీడియెట్ స్థాయిలో చదివిన గణితం అమెరికాలోని పెరూ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రంతో కూడిన ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కోర్సు చదివానని, డిగ్రీ మూడో ఏడాదిలో కూడా ఇంటర్ స్థాయిలో చేసిన కఠినమైన లెక్కలు చేయలేదని, మనదేశంలో గణితం చాలా కఠినంగా ఉంటుందని చమత్కరించారు. గణితం అంటే తర్కమని, అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమని శ్రీభరత్ అన్నారు.